చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు?

  • ఏఐ సాయంతో హిబ్రూ భాషలో ఫిషింగ్ మెసేజ్‌లు
  • F-35 యుద్ధ విమానాల సమాచారం కోసం జెమినీ వాడకం
  • క్షిపణులు, డ్రోన్ల నావిగేషన్ సిస్టమ్‌లో ఏఐ సాంకేతికత
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ వీడియోలు
  • యూఏఈ, బహ్రెయిన్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు
అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్.. పశ్చిమ దేశాల సాంకేతికతనే ఆయుధంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ హ్యాకర్లు ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘జెమినీ’ వంటి ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను వాడుకుంటున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. వీటి సాయంతో ప్రమాదకరమైన మాల్‌వేర్‌లను తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలతో సైబర్ యుద్ధానికి తెరలేపినట్లు పేర్కొంది. ఆ కథనం ప్రకారం..

ఫేక్ ప్రొఫైళ్లతో హనీ ట్రాప్
ఇరాన్ సైబర్ ముఠాలు ఏఐ సాంకేతికతతో ఇంటర్నెట్‌లో నకిలీ వ్యక్తులను సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ ప్రొఫైళ్లతో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ రంగ అధికారులతో చాట్‌ చేస్తూ వారిని నమ్మిస్తున్నాయి. తర్వాత మెల్లగా ప్రమాదకరమైన లింకులను పంపి సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలను మోసం చేయడానికి ఏఐ సాయంతో పక్కాగా హిబ్రూ, అరబిక్ భాషల్లో ఫిషింగ్ మెసేజ్‌లు, ఈమెయిళ్లను పంపుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈ కూడా తాము రోజుకు ఐదు లక్షలకు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని, అందులో చాట్‌జీపీటీ సాయం ఉన్నట్లు గుర్తించామని ప్రకటించింది.

ఎఫ్-35 యుద్ధ విమానాలపై కన్ను
ప్రముఖ టెక్ కంపెనీలు ఈ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ హ్యాకర్లు కొత్త దారులను వెతుకుతున్నారు. గత ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌కు చెందిన ‘APT42’ అనే హ్యాకర్ల ముఠా గూగుల్ జెమినీ ఏఐ మోడల్‌ను వాడుతున్నట్లు గూగుల్ స్వయంగా గుర్తించింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన ‘F-35’ యుద్ధ విమానాలకు సంబంధించిన పరిశోధనలు, సమాచారాన్ని సేకరించడానికి వారు ఈ ఏఐని వాడినట్లు తేలింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్, యూట్యూబ్ ఆయా ఖాతాలను నిషేధించాయి.

డ్రోన్లు, క్రూజ్ క్షిపణుల్లోనూ ఏఐ
ఏఐని ఇరాన్ కేవలం కంప్యూటర్ హ్యాకింగ్‌లకే పరిమితం చేయలేదు. రక్షణ రంగంలోనూ దీని వాడకాన్ని భారీగా పెంచేసింది. యుద్ధరంగంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, డ్రోన్ల గైడెన్స్ సిస్టమ్స్, సముద్ర గర్భంలో లక్ష్యాలను ఛేదించే అండర్ వాటర్ సిస్టమ్స్‌లో ఏఐని వాడుతోంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ క్రూజ్ క్షిపణుల్లో ఏఐ ఆధారిత నావిగేషన్, శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకునే ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు ఉన్నాయని ప్రకటించింది. అలాగే పశ్చిమ దేశాల సైనిక పరిశోధనా పత్రాలను వేగంగా అనువదించి చదవడానికి కూడా ఏఐ ట్రాన్స్‌లేషన్ టూల్స్ వాడుతోంది.

క్లౌడ్ డేటా సెంటర్లపై దాడులు
రాజకీయంగా అమెరికాను దెబ్బతీయడానికి ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ వీడియోలను ఇరాన్ నెట్టింట్లో వైరల్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అవహేళన చేస్తూ ఇరాన్‌కు మద్దతుగా ఉండేలా ఏఐ వీడియోలను క్రియేట్ చేసిన ‘ఎక్స్‌ప్లోజివ్ మీడియా’ అనే యూట్యూబ్ ఛానల్‌ను గూగుల్ బ్యాన్ చేసింది. మరోవైపు అమెరికా క్లౌడ్ కంపెనీలు ఇజ్రాయెల్ సైన్యానికి సహకరిస్తున్నాయంటూ ఇరాన్‌ వాటిని ‘దాడి చేయాల్సిన లక్ష్యాలు’గా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌లో యూఏఈ, బహ్రెయిన్‌లలో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కి చెందిన రెండు డేటా సెంటర్లపై డ్రోన్లతో దాడులు చేయడం గమనార్హం.

Iran
Iran attacks
ChatGPT
Gemini AI
Israel
United States
cyber attacks
AI warfare
F-35
hacking

More Telugu News